పిఠాపురం : మతతత్వ రాజకీయాలు చేస్తున్న ఎన్.డి.ఏ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి. గత ఎన్నికలలో ఎన్.డి.ఏ కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల డిసెంబర్ 4న సిపిఐ (యమ్.యల్) లిబరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో జరుగు ప్రజా హక్కుల సభను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ పిఠాపురం నియోజకవర్గం సిపిఐ(యమ్.యల్) లిబరేషన్ పార్టీ కార్యకర్తల సమావేశం మండల కేంద్రమైన కొత్తపల్లిలో పార్టీ జిల్లాకమిటీ సభ్యులు, మహిళా సంఘం (ఐప్వా) జిల్లా అధ్యక్షురాలు శీలం అప్పలరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.బంగార్రావు మాట్లాడుతూ కేంద్రంలో ఎన్.డి.ఏ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి మతతత్వ రాజకీయాలను కొనసాగిస్తుందని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రాధాన్యత పేరుతో ఆర్.ఎస్.ఎస్ సభ్యుల్ని కీలకమైన ఉన్నత పదవుల్లో నింపడానికి ప్రయత్నిస్తుందని దుయ్యబట్టారు. దేశంలో ఉన్నత చదువులు చదివిన యువతతో ప్రభుత్వరంగ సంస్థలలో వున్న ఖాళీలను భర్తీ చేసి, నిరుద్యోగాన్ని నిర్మూలించవలసిన ఎన్.డి.ఏ కూటమి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తూ నిరుద్యోగాన్ని పెంచిపోసిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ లాంటి హామీలను, రోడ్లు, ఇతర మౌలిక అవసరాలను తీర్చకుండ ప్రజల దృష్టిని మళ్లించడానికి తిరుపతి లడ్డు, సనాతన ధర్మం అని మతతత్వ రాజకీయాలను సృష్టించిందని విమర్శించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు కారణంగా వరదలతో తన నియోజకవర్గంలో వ్యవసాయం నీట మునిగి రైతాంగం తీవ్రంగా నష్టపోతే, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదల పవన్ కళ్యాణ్ ఒక్కరోజు చుట్టం చూపు పర్యటన చేసి, నష్టపోయిన వారికి విధమైన నష్ట నివారణ చర్యలు చేపట్టకుండా వెళ్లిపోవడం నియోజకవర్గంపై ఆయనకు ఉన్న శ్రద్ద ఏమిటో అర్థం అవుతుందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక మతతత్వ రాజకీయాలకు నిరసనగా భారత రాజ్యాంగం కల్పించిన ప్రజల హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (యమ్.యల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో 2024 డిసెంబర్ 4న విజయవాడలో జరుగు ప్రజా హక్కుల సభలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు శీలం అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర వస్తువులతో పాటు నిర్మాణ రంగ మెటీరియల్ కూడ విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులు సొంత ఇంటిని నిర్మించుకునే స్థాయిలో లేరని, ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన పేదలకు ఇళ్ల స్థలం కేటాయించి, ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, కొత్తగా పెళ్ళైన ప్రతి కుటుంబానికి జాబ్ కార్డులు ఇవ్వాలని, జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వంద రోజులు పూర్తిగా పని కల్పించాలని, అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలని, 18 సంవత్సరాల దాటిన ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇవ్వాలని, గ్యాస్ ఏజెన్సీల గోడౌన్ల వద్దె డబ్బులు చెల్లించకుండానే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పై డిమాండ్ల పరిష్కారానికై, భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగం కల్పించిన ప్రజా హక్కులను కాపాడుకొనుటకై ప్రజా హక్కుల సభ నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం ప్రజా హక్కుల సభ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గొడుగు సత్యనారాయణ, జిల్లా నాయకులు పి.ఏసురత్నం, మండల నాయకులు లోవకుమారి, సోనీ, రాంబాబు, రాజు, బొందు రాజేష్, రాజేశ్వరి, ప్రమీల, లక్ష్మీ, చిట్టియ్య, జగన్నాథం, కమలాకర్, వినోద్ మరియు కోనపాపపేట, మూలపేట, ఉప్పాడ, కొత్తపల్లి, ఎండపల్లి, పిఠాపురం, కందరాడ తదితర గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు.